- కుటుంబ కలహాల నేపథ్యంలో విషాద ఘటన
కాకతీయ, వరంగల్ బ్యూరో : నర్సంపేట డివిజన్ పరిధిలో ఓ పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎండీ. ఆసిఫ్ (57) కుటుంబ సమస్యలతో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నర్సంపేట పట్టణంలోని వల్లభ్ నగర్‌లో నివసిస్తున్న ఆసిఫ్, శుక్రవారం విధులకు హాజరైన తర్వాత రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను సహచరులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శనివారం ఆయన మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై మృతితో పోలీసు వర్గాల్లో విషాదం నెలకొంది.


