నేత్రపర్వంగా నాచగిరిలో శ్రీ లక్ష్మీ నృసింహ విమాన రథోత్సవం
– భక్తులు హరిద్రా నదిలో పుణ్యస్నానాలతో పునీతులయ్యారు
– భక్తి పారవశ్యంతో విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
– ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహణ
కాకతీయ, గజ్వేల్ : ప్రసిద్ధ నాచగిరి శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి విమాన రథోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్త, కార్యనిర్వహణ అధికారి బెల్లంకొండ రంగాచారి ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి వేద పండితుల మంత్రోచ్చరణలు, భక్తుల హర్షధ్వానాల మధ్య రథప్రతిష్ట నిర్వహించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన విమాన రథంపై సతీసమేతులైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని అధిష్టింపజేశారు. తదనంతరం భక్తుల దర్శనార్థం ఉంచగా, అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హరిద్రా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ సందర్భంగా నాచగిరి, శ్వేతగిరి కొండలు స్వామివారి నామస్మరణతో మార్మోగాయి. భక్తుల భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మహిళల కోలాటాలు, పోతరాజులు, శివసత్తుల విన్యాసాలు, కళాకారుల నృత్యాలు భక్తులను కనువిందు చేశాయి.

నాచగిరి పురవీధుల్లో విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తుల కోలాహలం మధ్య స్వామివారిని అత్యంత వైభవంగా ఊరేగించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహా ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు విజయ మోహన్, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీలు నిమ్మ రంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి బాలు యాదవ్, కాంగ్రెస్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు వెంకటేష్, స్థానిక సర్పంచ్ సారిక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


