మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ
21 నుంచి మహోత్సవాలు
కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ (ఎల్‌ఎండి) గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 21 నుండి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న మహాకుంభాభిషేక, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలకు దేవాలయ ప్రాంగణం భక్తజనంతో కోలాహలంగా మారనుంది. అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పార్వతీదేవి, నవగ్రహ, శిఖరధ్వజ సహా వివిధ దేవతామూర్తుల ప్రతిష్ఠ కోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామివారు స్వయంగా ఈ మహోత్సవాలకు విచ్చేసి యంత్ర ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, కళాన్యాసం, మహాకుంభాభిషేకం వంటి ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. 21వ తేదీ ఉదయం మంగళవాయిద్యాలు, చతుర్వేద స్వస్తివచనాలతో మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. యజ్ఞశాల ప్రవేశం, హోమకుండ సంస్కారం, నవగ్రహ మాతృక దేవతా స్థాపన, అగ్ని ప్రతిష్ఠలతో తొలి రోజు కార్యక్రమాలు కొనసాగనున్నాయి. సాయంత్రం గణపతి, నవగ్రహ, ప్రధాన దేవతామూర్తుల వాసపూర్వక జలాధివాసం, హారతి, తీర్థప్రసాదాలు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.22వ తేదీన స్థాపిత దేవతా పూజలు, వాస్తు యోగిని క్షేత్రపాలక దేవతల హవనాలు, మూలమంత్ర హోమాలు, సాయంత్రం రుద్రహవనం, మహాస్నపనం, శయ్యాదివాస, పుష్పాదివాస వంటి పరంపరాగత కార్యక్రమాలు జరగనున్నాయి. 23వ తేదీ ఆదివారం ఉదయం నుంచి బ్రహ్మశిల సంస్కారం, రత్న దాతు బీజన్యాసాలు నిర్వహించి, మకర లగ్నంలోని శుభ ముహూర్తం ఉదయం 10.20 గంటలకు ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అనంతరం జయాది హోమం, పూర్ణాహుతి, మహాకుంభాభిషేకం, అలంకరణ, హారతులు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. సాయంత్రం మహా పడిపూజ అనంతరం అన్నప్రసాద విందు ఏర్పాటు చేశారు.కులం, మతం, జాతి అన్న భేదాలు లేని అయ్యప్ప దీక్ష మహిమను అన్ని వర్గాలకు చేర్చే దిశగా ఈ కొత్త అయ్యప్ప దేవాలయం భక్తులకు ఓ దివ్యక్షేత్రంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. గురు స్వామి కావేటి పరమేశ్వర స్వామి పర్యవేక్షణలో జరగుతున్న ఈ ప్రతిష్టాపన మహోత్సవాల్లో సమస్త హిందూ బంధువులు, అయ్యప్ప భక్తులు సకుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి దివ్యకరుణ పొందాలని దేవాలయ కమిటీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.


