నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..!
గిరి ప్రదక్షిణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
కాకతీయ, గజ్వేల్ : నాచగిరి శ్రీ లక్ష్మీనృసింహ క్షేత్రంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. నాచగిరి క్షేత్ర గిరి ప్రదక్షిణ పూర్వజన్మ సుకృతమని శ్రీ గురు మదనానంద పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. ఆదివారం నాచగిరి క్షేత్రంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ రవీందర్ గుప్త ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి బెల్లంకొండ రంగాచారి, మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజయ మోహన్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ నృసింహ నామస్మరణతో కొండలను మార్మోగించారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ శ్రీ నారసింహుడు నడయాడిన ఈ ప్రాంతం ఎంతో పవిత్రమని తెలిపారు. స్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ చేయడం మహా పుణ్యకార్యమన్నారు. భగవన్నామ స్మరణతో మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. అనంతరం వేద పండితుల మంత్రోశ్చరణల మధ్య స్వామీజీ నాచగిరి వార్షిక బ్రహ్మోత్సవాలకు జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ఉషశ్రీ రాజశేఖర శర్మ, చందా నాగరాజు గుప్త, జగ్గయ్యగారి శేఖర్ గుప్త, శ్రీనివాస్, రుద్ర శ్రీహరి, గాలి కిష్టయ్య, సురేందర్ రెడ్డి, కర్రె పద్మ వెంకటేష్, సర్పంచులు సారిక యాదగిరి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


