కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..
భద్రకాళి అమ్మవారికి అర్చనలు.. నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ..
బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో కేక్ కటింగ్..
విద్యార్థులకు ఫీజుల చెల్లింపు..
తెలంగాణ జాతిపిత కేసీఆర్ : దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యలు..
కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాయకత్వం వహించిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు 72వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం వరంగల్ లోని భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేసీఆర్ గోత్రనామాలతో వారి కుటుంబ సభ్యుల పేరిట అర్చనలు చేశారు. రాష్ట్రం శాంతి, సుభిక్షాలతో అభివృద్ధి చెందాలని దేవిని ప్రార్థించారు. అనంతరం దేవాలయం వెలుపల ఉన్న నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రజా సేవే కేసీఆర్ ఆశయమని, ఆయన చూపిన మార్గంలో పార్టీ శ్రేణులు నడవాలని ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ తెలిపారు. తదుపరి బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి, మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇద్దరు నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించిన ఫీజులను చెల్లించి వారికి రశీదులు అందజేశారు. దివ్యాంగులు నిర్వహించిన ప్రత్యేక జన్మదిన కార్యక్రమంలో కూడా నాయకులు పాల్గొని వారికి ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి గోస తీర్చిన ధీరుడు కేసీఆర్ అని, తెలంగాణ జాతిపిత. 60 ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన ఉద్యమ కెరటం ఆయన. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారు. రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, దివ్యాంగులు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లారు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


