నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు
కాకతీయ, గీసుగొండ : మృగశిర మాసం చివరి మంగళవారాన్ని పురస్కరించుకొని మండలంలోని ఊకల్ హవేలీ గ్రామంలో కొలువుదీరిన శ్రీ వల్లిదేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వైదిక మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉప అర్చకులు శ్రీహర్ష, ఆలయ కమిటీ చైర్మన్ తిమ్మాపురం రాజేశ్వరరావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


