కాకతీయ, ములుగు: ములుగు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం రాష్ట్రీయ బాలికల స్వస్థత కార్యక్రమం (ఆర్ బి ఎస్ కె)పై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు మాట్లాడుతూ.. బాలల ఆరోగ్య సంరక్షణలో వైద్య సిబ్బంది మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి వైకల్యాలతో పుట్టిన పిల్లలను గుర్తించి టెర్షరీ ఆసుపత్రులకు రిఫర్ చేయాలని, స్క్రీనింగ్‌లో తీవ్ర రక్తహీనతతో ఉన్న పిల్లలను సామాజిక ఆరోగ్య కేంద్రం ఏటూరునాగారం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ములుగు లేదా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు పంపించాలని ఆదేశించారు.
సంబంధిత డైస్ కేంద్రాలకు పిల్లలను రిఫర్ చేసి, రోజువారీ స్క్రీనింగ్ వివరాలను ఆర్బిఎస్కే పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి అని, నెలవారీ షెడ్యూల్ ప్రకారం పాఠశాలలలో స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పిల్లలలో వ్యక్తిగత పరిశుభ్రత, ప్రతిరోజు ఒక గంట వ్యాయామం, యోగా, పోషకాహార ప్రాముఖ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా ఆర్బిఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ రణధీర్, జిల్లా ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పవన్ కుమార్, ఆర్బిఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ నరహరి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ జయప్రద, డెమో సంపత్, ఎన్సిడి కోఆర్డినేటర్ వెంకట్ రెడ్డి, ఆర్బిఎస్కే ఫార్మసీ ఆఫీసర్లు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


