మహిళ భద్రతపై ప్రత్యేక దృష్టి
విద్యాసంస్థల్లో షీ టీమ్ అవగాహన కార్యక్రమాలు
వేధింపులపై నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సూచనలు
కాకతీయ, సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా షీ టీమ్ విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళలు పనిచేసే ప్రదేశాలు, విద్యాసంస్థలను సందర్శిస్తూ మహిళా రక్షణకు సంబంధించిన చట్టాలు, అందుబాటులో ఉన్న సేవలపై చైతన్యం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టం, మహిళలపై జరిగే వేధింపులు, షీ టీమ్ సేవల వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పిస్తున్నారు. శనివారం బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను షీ టీమ్ బృందం సందర్శించి విద్యార్థులతో సమావేశమై జాగ్రత్తలు, చట్టపరమైన రక్షణ అంశాలపై సూచనలు అందించింది.
వేధింపులకు గురైన పక్షంలో నిర్భయంగా షీ టీమ్ నెంబర్ 87126 56425కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలో అపరిచితులతో మాట్లాడవద్దని, గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని విద్యార్థులను అప్రమత్తం చేశారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వచ్చిన వెంటనే తల్లిదండ్రులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐ ప్రమీల, వీరయ్య, సిబ్బంది శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్‌తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


