కాకతీయ, నల్గొండ : నల్గొండలో నిర్మాణంలో ఉన్న కొత్త కలెక్టర్ కార్యాలయ భవన పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. 82 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో నిర్మాణం జరుగుతున్న ఈ కార్యాలయ భవనంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ విభాగం, మంత్రి ఛాంబర్ వంటి విభాగాలు ఏర్పాటు కానున్నాయి. పాత కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధిపతుల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని, దానిని ఆధునీకరించాలని మంత్రి ఆదేశించారు.
గ్రౌండ్ ఫ్లోర్‌ను ఈ ఏడాది డిసెంబర్‌లోగా, మొత్తం భవనాన్ని వచ్చే సంవత్సరం జూన్ 2 నాటికి పూర్తి చేసి అప్పగించాలని ఆర్‌అండ్‌బి అధికారులు, కాంట్రాక్టర్‌ను మంత్రి ఆదేశించారు. మీటింగ్ హాల్‌ను ఆధునిక సదుపాయాలతో నిర్మించాలని సూచించారు. నిర్మాణ అంచనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని ఆయన స్పష్టం చేశారు. భవన నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని మంత్రి కోరారు. ఈ కార్యాలయం పూర్తి అయిన తరువాత బయటి ప్రాంతాల్లో ఉన్న డీఈఓ, డీఎంహెచ్ఓ కార్యాలయాలను కూడా ఇక్కడికి తరలిస్తామని తెలిపారు.
అలాగే, బ్రహ్మం గుట్ట, లతీఫ్ సాబ్ దర్గా గుట్టలపై జరుగుతున్న ఘాట్ రోడ్ల నిర్మాణ పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఇప్పటివరకు 5 కిలోమీటర్ల రహదారి పూర్తయిందని అధికారులు వివరించగా, మిగతా పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్‌అండ్‌బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ అశోక్ రెడ్డి, ఏవో మోతిలాల్, కాంట్రాక్టర్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


