పదో తరగతికి ప్రత్యేక తరగతులు
ఉదయం–సాయంత్రం క్లాసులు తప్పనిసరి
వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యం.. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి
డీఈఓ రాజేశ్వరరావు ఆదేశాలు
కాకతీయ, నర్సింహులపేట : పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వరరావు ఆదేశించారు. గురువారం నర్సింహులపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి, పాఠశాల దస్త్రాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ, ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం బోధన కొనసాగించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, పరీక్షలకు విద్యార్థులను మానసికంగా, అకడమిక్‌గా సిద్ధం చేయాలని డీఈఓ తెలిపారు. ఉపాధ్యాయుల సమన్వయం, కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామ్మోహన్ రావు, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, మందుల శ్రీరామ్, వేణు కుమార్, జగన్, సీఆర్‌పీలు తదితరులు పాల్గొన్నారు.


