ఎస్సీ సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం
జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో ఎస్సీ వర్గాల సంక్షేమంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారి జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా సమగ్ర చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి గూడె శ్రీనివాస్ ఆదేశించారు. గ్రామ స్థాయి వరకు సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా క్షేత్రస్థాయి పర్యవేక్షణను మరింత పెంచాలని సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌కు వచ్చిన ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్ తో పాటు సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ వర్గాల సంక్షేమానికి అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ఎస్సీలపై వివక్ష, అణచివేతకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చిన వెంటనే అధికారులు స్పందించాలని సూచించారు. ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వేగవంతమైన విచారణ చేపట్టి బాధితులకు తక్షణ సహాయం అందేలా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్య, ఉపాధి, గృహనిర్మాణం, ఆరోగ్యం, సామాజిక భద్రత వంటి పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయా అనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్కాలర్‌షిప్‌ల పంపిణీ, హాస్టళ్ల వసతులు, స్వయం ఉపాధి యూనిట్లు, ఆర్థిక సహాయం, భూ సమస్యలపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ–ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అట్రాసిటీ కేసులపై తరచూ సమీక్షలు నిర్వహిస్తూ విచారణ వేగవంతం అయ్యేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు, ఆర్డీవో కె. మహేశ్వర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎస్సీ సంక్షేమ శాఖ ఉపసంచాలకులు నాగైలేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అనిల్ ప్రకాష్, ఏసీపీ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


