ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
వరంగల్ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
కాకతీయ, వరంగల్ : గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వరంగల్ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి 106 ఫిర్యాదులను స్వీకరించారు. స్వీకరించిన వినతులను పరిష్కారం నిమిత్తం సంబంధిత విభాగాల ఉన్నతాధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు.
టౌన్ ప్లానింగ్‌పై దృష్టి
టౌన్ ప్లానింగ్ ఫిర్యాదుల పరిష్కారంలో పురోగతి స్పష్టంగా కనిపించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి 56, ఇంజనీరింగ్ విభాగానికి 21, రెవెన్యూ విభాగానికి 34, హెల్త్ శానిటేషన్‌కు 9, నీటి సరఫరా విభాగానికి 7 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 106 వినతులు స్వీకరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, డిఎఫ్ఓ శంకర్ లింగం, టౌన్ ప్లానింగ్ అధికారులు రామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


