రమజాన్‌కు నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు బీజేపీ మైనార్టీ మోర్చా వినతి
కాకతీయ, కరీంనగర్ : రాబోయే పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని నగరంలో అవసరమైన సదుపాయాలు కల్పించాలని బీజేపీ మైనార్టీ మోర్చా నేతలు కోరారు. ఈ మేరకు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు.
మస్జిద్‌ల పరిసర ప్రాంతాలు, మైనారిటీ వార్డుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. రమజాన్ సందర్భంగా మస్జిద్‌ల వద్ద తగినంత వీధి దీపాలు ఏర్పాటు చేయడం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ఇఫ్తార్ అనంతరం చెత్తను వెంటనే తొలగించడం, తాగునీటి సరఫరా మెరుగుపరచాలని సూచించారు.
సేహరీ సమయాల్లో హోటళ్లను ఆలస్యంగా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని, తరావీహ్ నమాజ్ సమయంలో అవసరమైతే తాత్కాలికంగా రహదారులు మూసివేయాలని కోరారు. భద్రతా ఏర్పాట్లు పెంచడంతో పాటు దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీలను మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు.
పవిత్ర రమజాన్ మాసం శాంతియుత వాతావరణంలో జరగేందుకు మున్సిపల్ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీబ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొహమ్మద్ బషీరుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి సమీయుల్లా అహ్మద్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సిద్దిక్ పాల్గొన్నారు.


