బద్ది పోచమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
సమ్మక్క–సారలమ్మ జాతర, శివరాత్రి దృష్టిలో చర్యలు
భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం
క్యూలైన్లు, సీసీ ఫ్లోర్, చలువ పందిర్లు ఏర్పాటు
పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం, మహాశివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకుని భారీగా వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఆదేశాల మేరకు ఆలయ ప్రాంగణంలో నూతన సీసీ ఫ్లోర్ నిర్మాణం, భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్ల ఏర్పాటు చేపట్టారు. అదేవిధంగా భక్తులు వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన ప్రాంతాల్లో చలువ పందిర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
ఈ సందర్భంగా ఆలయ ఈవో ఎల్. రమాదేవి సిబ్బందికి పలు సూచనలు చేసి భక్తులకు సులభంగా, ప్రశాంతంగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బుధవారం ఆలయంలో ప్రత్యేక పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, సానిటేషన్, ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో శుభ్రత పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీఈ మైపాల్ రెడ్డి, ఏఈఓ జి. అశోక్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ టి. రాజేశ్వరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంతో పాటు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.


