పార్టీ మారిన ఎమ్మెల్యేలకు త్వరలో స్పీకర్ నోటీసులు?
న్యాయ సలహా అనంతరం స్పీకర్ నిర్ణయం
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ..
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం స్పీకర్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈక్రమంలోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్‌ను ఆదేశిస్తూ, ఇటువంటి ఫిరాయింపు కేసులపై ఒక నెలలోపు తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అడ్వకేట్ జనరల్‌తో పాటు న్యాయ నిపుణుల సూచనలు తీసుకున్నారు. వారి సలహాల అనంతరం ఆయా ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నోటీసులు త్వరలోనే అందజేయనున్నట్లు అసెంబ్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఫిరాయింపుల ద్వారా అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఇదే కానుంది. స్పీకర్ నోటీసులు అందజేస్తే రాజకీయపరిణామాలు ఎలా మారుతాయి..? ప పార్టీ మారిన ఎమ్మెల్యేల రియాక్షన్ ఎలా ఉంటుంది..? అన్న విషయంతో పాటు ఉప ఎన్నికలు వస్తే ఎన్నినియోజకవర్గాల్లో వచ్చే అవకాశం ఉంది అన్న అంశంపై ఇప్పుడు ప్రధాన రాజకీయపార్టీల అధినాయకత్వాల్లో చర్చ జరుగుతోంది.


