*మేం పార్టీ మారలేదు అధ్యక్షా..!
*బీఆర్ ఎస్‌లోనే కొనసాగుతున్నాం
*పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు
*అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశాం
*మాకు కండువాలు కప్పలేదు.. కప్పిన కండువాలు కాంగ్రెస్‌వి కానేకావు
*పార్టీ ఫిరాయింపు నోటీసులపై అసెంబ్లీ స్పీకర్‌కు 8మంది ఎమ్మెల్యేల వివరణ
*మాకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరిన కడియం, దానం
*8మంది ఎమ్మెల్యేల వివరణలను బీఆర్ ఎస్ కార్యాలయానికి పంపిన స్పీకర్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 8మంది ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు స్పందించారు. అసలు తాము పార్టీయే మారలేదని, బీఆర్ ఎస్‌లోనే కొనసాగుతున్నామని స్పీకర్ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసమే తాము సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని, పార్టీలో చేరినట్లుగా ఎక్కడా ప్రకటించుకోలేదని, బీఆర్ ఎస్‌పై విమర్శలు కూడా ఎక్కడా చేయలేదని బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం మరింత గడువు కావాలని స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల సమాధానాలను ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి స్పీకర్ కార్యాలయ అధికారులు పంపించారు. సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా వీరి పైన నిర్ణయం తీసుకోవాలని సూచించటంతో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చిన నేపథ్యంలో తర్వాత బీఆర్ ఎస్ స్పందన, స్పీకర్ చర్యలు ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
మాకు మరి కొంత సమయం కావాలి : కడియం, దానం
పార్టీ ఫిరాయింపుల ఆరోపణల నోటీసుల జారీపై వివరణ ఇచ్చేందుకు తమకు మరికొంత సమయం కావాలని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌ను స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు కోరినట్లు సమాచారం. తాము ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని..బీఆర్ఎస్‌కు రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఇచ్చిన వివరణలో పలు లీగల్ జడ్జిమెంట్లను కుడా వివరణల్లో పేర్కొనడం గమనార్హం. తాము పార్టీ మారినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని, బీఆర్ఎస్ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని, ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని వివరణ ఇచ్చుకున్నట్ల తెలుస్తోంది.
ఎన్నికలైకైనా సిద్ధమే..!: దానం, కడియం ఆలోచన ఇదే..
పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని.. పార్టీ మారలేదని స్పీకర్‌కు సమాధానం ఇచ్చారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం తమకు మరింత సమయం కావాలని అడిగారు. వీరిద్దరూ తాము ఉపఎన్నికలకు అయినా సిద్ధం కానీ బీఆర్ఎస్‌లో ఉన్నట్లుగా చెప్పుకోవడానికి ఇష్టపడటం లేదని సమాచారం. వాస్తవానికి గత ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి వీరందరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, న్యాయనిపుణులు సూచనలు అన్నింటిపై చర్చించాకా టెక్నికల్ అంశాల ఆధారంగానే స్పీకర్ వేటు నుంచి తప్పించుకోవడం తప్పా మరో మార్గం లేదని సూచినట్లుగా తెలుస్తోంది. ఈమేరకే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పీకర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే కడియం, దానం నాగేందర్‌లు మాత్రం అలా చేయడానికి అయిష్టంగా ఉన్నట్లు సమాచారం. అవసరమైతే పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎలక్షన్లకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పరిణామాలను బట్టి నిర్ణయాలను తీసుకునే విధంగా ఆచితూచి వ్యవహరించడం అనే వ్యూహాత్మక వైఖరితో స్పీకర్‌ను మరింత సమయం కోరినట్లుగా విశ్లేషణ జరుగుతోంది.
అనర్హత పిటిషన్ల తిరస్కరణే..?!
ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అలాగే టెక్నికల్ టెర్మ్స్ ప్రకారం వారెవరూ పార్టీ మారలేదనే వాదన న్యాయనిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేశారు కాబట్టి ఆయన పార్టీ మారినట్లుగా ఆధారాలు చూపడం బీఆర్ ఎస్‌కు సులభతరమే. ఇక కడియం విషయానికి వస్తే కడియం కూడా తాను పార్టీ మారలేదని చెప్పుకోవడానికి అవకాశం ఉంది.. కానీ తనకున్న పొలిటికల్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకునే బీఆర్ ఎస్‌లోనే ఉన్నట్లుగా చెప్పుకోవడానికి ఇష్టం పడటం లేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ ఎనిమిది మందిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హతా పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడం ఖాయం. మరి ఇద్దరి సంగతిని ఏం చేస్తారన్నది మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది.


