మల్లంపల్లి బ్రిడ్జి పనులపై ఎస్‌పీ సమీక్ష
కాకతీయ కథనానికి స్పందన
మేడారం జాతరకు ఆటంకం లేకుండా ఆదేశాలు
నాణ్యతతో వేగంగా పనులు పూర్తి చేయాలని సూచన
కాకతీయ, ములుగు ప్రతినిధి : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర సమయం సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు రోజులుగా మల్లంపల్లి–జాకారం మార్గంలో వాహనాల రాకపోకలు గణనీయంగా పెరగడంతో ఆదివారం రాత్రి కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ పరిస్థితిపై కాకతీయ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ములుగు జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ తక్షణమే చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం మల్లంపల్లి చేరుకున్న ఎస్పీ, అక్కడ జరుగుతున్న మల్లంపల్లి బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేడారం జాతర సమయంలో భారీ భక్తజన సమూహం రాకపోకలు సాగుతాయని, అదే సమయంలో ఈ మార్గం జాతీయ రహదారికి కీలకమైనదని గుర్తుచేశారు.

భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ సజావుగా సాగాలంటే బ్రిడ్జి పనులు వేగంగా, నాణ్యతతో పూర్తవాలని జాతీయ రహదారి శాఖ అధికారులను ఆదేశించారు. బ్రిడ్జి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించేందుకు తాను మరోసారి స్వయంగా వస్తానని ఎస్పీ తెలిపారు. అలాగే స్థానిక పోలీసులు రోజువారీగా పరిస్థితిని గమనిస్తూ నివేదికలు అందజేయాలని సూచించారు. ప్రమాదాలకు తావులేకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ట్రాఫిక్ నిర్వహణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. భక్తుల భద్రత, సౌకర్యాలే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో జాతీయ రహదారి శాఖ డీఈ కిరణ్ కుమార్, ఏఈ చేతన్, ములుగు సీఐ సురేష్, ప్రొబేషనరీ ఎస్‌ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



