కవిత దీక్షకు కుమారుడి మద్దతు
వెలుగుమట్ల బాధితుల కోసం మూడో రోజు నిరాహార దీక్ష
జాగృతి కార్యాలయంలో మద్దతుగా కూర్చున్న తనయుడు
కాకతీయ,తెలంగాణ బ్యూరో : బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. ఈ దీక్షకు ఆమె తనయుడు ఆదిత్య కూడా మద్దతుగా కూర్చున్నారు. తల్లి పోరాటానికి సంఘీభావంగా ఆయన కార్యాలయంలోనే కవితతో పాటు దీక్షలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

తల్లి పోరాటానికి అండగా
అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఇటీవలే తిరిగి వచ్చిన ఆదిత్య అప్పటి నుంచి తల్లి కవితకు అండగా ఉంటున్నారు. పలు కార్యక్రమాల్లో ఆమె వెంట కనిపిస్తూ జాగృతి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రస్తుతం వెలుగుమట్ల బాధితులకు ఇండ్ల స్థలాల కోసం జరుగుతున్న దీక్షలో కూడా తల్లి పక్కనే కూర్చొని మద్దతు ప్రకటించారు. ఇదివరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం కవిత చేపట్టిన నిరాహార దీక్షలోనూ ఆదిత్య పాల్గొన్నారు. బీసీ బిల్లుల ఆమోదం కోసం నిర్వహించిన బంద్ కార్యక్రమాల్లో కూడా తల్లి వెంట కనిపించారు. అలాగే జాగృతి నిర్వహించిన జనంబాట కార్యక్రమంలోనూ ఆదిత్య చురుకుగా పాల్గొనడం గమనార్హం. ప్రస్తుతం కవిత దీక్ష కొనసాగుతుండగా జాగృతి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలుపుతున్నారు.


