తల్లిపై గొడ్డలితో కొడుకు దాడి
మహబూబాబాద్ జిల్లాలో కలకలం
ప్రాణాపాయ స్థితిలో తల్లి
కాకతీయ, వరంగల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధ్యమత్తులో ఉన్న కుమారుడు తన తల్లిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమపై ఆమె కుమారుడు అజీమ్ దాడి చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో ఉన్న అజీమ్ గొడ్డలితో తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో లచ్చమకు రెండు చేతులు మరియు మెడ వద్ద తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన లచ్చమ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటన గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాడి చేసిన కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దారుణ ఘటనతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది.


