గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారం
99 రోజుల ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు
ఇంటింటికీ సంక్షేమ పథకాల అమలు లక్ష్యం
గిరిజన మహిళలకు ఉపాధి అవకాశాలు
కొత్త పథకాలతో కుటుంబాలకు భరోసా
భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్
కాకతీయ, మణుగూరు టౌన్ : ప్రభుత్వం ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరిస్తోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా పని చేసి ప్రజలకు మౌలిక వసతులు అందించాలని సూచించారు. గురువారం మణుగూరు మండలంలో పర్యటించిన ఆయన మున్సిపాలిటీలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లోకి వెళ్లి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను సేకరించి తీర్మానాల రూపంలో ప్రభుత్వానికి పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇంటింటికి వెళ్లి అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. గత రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను చాలా కుటుంబాలు వినియోగించుకున్నాయని పేర్కొన్నారు.
గిరిజన మహిళలకు ఉపాధి
చెర్ల మండలం ఆర్ కొత్తగూడెం గ్రామంలో గిరిజన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇప్పపువ్వుతో లడ్డూలు, చాక్లెట్లు, బర్ఫీలు తయారు చేసేలా ప్రోత్సహించామని తెలిపారు. మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడిన వారికి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో వారు తమ ఉత్పత్తులను కరీంనగర్, వరంగల్, సూర్యాపేట ప్రాంతాల్లో విక్రయించి ఉపాధి పొందుతున్నారని చెప్పారు. దేవాలయం ప్రాంగణం, ట్రైబల్ మ్యూజియం, ఐటిడిఏ కార్యాలయంలో అమ్మకాల సౌకర్యం కల్పించామని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళలు ఆన్లైన్ ద్వారా కూడా వ్యాపారం విస్తరించారని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాల విస్తరణ
రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రైతు భరోసా, ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. త్వరలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. ప్రమాదంలో కుటుంబ పెద్ద మరణించినా ఆర్థిక భరోసా అందేలా ఈ పథకం ఉండబోతుందని వివరించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పాఠశాలల నుంచి విస్తరించి ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కూడా అల్పాహారం, భోజనం అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. దివ్యాంగ విద్యార్థులకు మూడు చక్రాల స్కూటీలు అందించే కార్యక్రమం కూడా త్వరలో అమలులోకి వస్తుందని తెలిపారు. సేంద్రియ వ్యవసాయం ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నామని, రైతులు సహజ పద్ధతుల్లో పంటలు పండించేలా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. గ్రామసభలో ప్రజలు చెప్పిన సమస్యలను సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని, త్వరలో పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, విద్యుత్ శాఖ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు, సర్వేశ్వరరావు, జిపిఓ లక్ష్మణ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


