సమస్యలను పరిష్కరించండి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ మున్సిపాలిటీలో సమస్యలను పరిష్కరించాలని వివిధ సంఘాల నాయకులు చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి రమేష్ ను కోరారు. ఈ మేరకు బుధవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లోని 104 కాలనీలలో పదిరోజులుగా టీపీజేఏసీ, జేఏసీ, మాలమహానాడు, ఎమ్మార్పీఎస్, పి వై ఎల్ ప్రజా సంఘాల ఆద్వర్యంలో సమస్యలపై సమగ్ర సర్వే నిర్వహించామన్నారు. ప్రధానంగా శివారు కాలనీలు, విలీన గ్రామల సమస్యలు పట్టణంలో ఎదురవుతున్న పలు సమస్యలను ప్రజలనుండి సేకరించి గుర్తించమన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ, సిసి రోడ్ ల నిర్మాణం, నీటి ఎద్దడి, వీది లైట్లు, పారిశుధ్య నిర్వహణ, శ్మశానవాటికల నిర్మాణం, గ్రీన్ పార్కుల అభివృద్ధి, పాతబజారులో గ్రంధాలయం, కూరగాయల మార్కెట్ ఏర్పాటు, గాంధీపార్క్ లోని కూరగాయల మార్కెట్ ను నూతంగా నిర్మించిన ఇంటిగ్రే టెడ్ మార్కెట్ లో కి తరలించేందుకు కృషి చేయాలన్నారు. ఆఫీసర్స్ క్లబ్ స్థలాన్ని స్వాధీన పరుచుకొని అభివృద్ధి పరుచుట, అండర్ డ్రైనేజీల నిర్మాణం, రింగ్ రోడ్డు నిర్మాణం, పారిశుధ్య నిర్వహణ కొరకు అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు. సమస్యలను ఆయా కాలనీల ప్రజల నుండి తెలుసుకుని ఒక నివేదిక తయారు చేశామన్నారు. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని సమస్యలతో రూపొందించిన నివేధికను మున్సిపల్ చైర్మన్ గుగులోత్ జ్యోతి రమేష్, కమిషనర్, వైస్ చైర్మన్ సూర్ణపు సోమయ్యకు అందజేశామని తెలిపారు. ఆయా సంఘాల భాద్యులు మైస శ్రీనివాసులు, డాక్టర్ డోలి సత్యనారాయణ, గుగ్గిళ్ల పీరయ్య, పిల్లి సుధాకర్, సోమ విష్ణువర్ధన్, గుజ్జు దేవేందర్, బుర్ర గోవర్ధన్,షేక్ జానీ, హలవత్ లింగ్యా, సామ పాపయ్య పాల్గొన్నారు.


