మహిళల ఆరోగ్యంతోనే సామాజిక పురోగతి
అంగన్వాడీల ద్వారా పోషణ–విద్య బలోపేతం
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం నుంచి సమాజం వరకు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా అమలవుతున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బొమ్మకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం ఆవరణలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల ఆరోగ్యం మెరుగైతే కుటుంబ ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షల ద్వారా వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్స పొందవచ్చని వివరించారు.
క్యాన్సర్ గుర్తింపులో కీలకం
ఆరోగ్య మహిళ పరీక్షల ద్వారా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించిన ఉదాహరణలు ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత పరీక్షలు, మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అనవసర ఖర్చులు చేయవద్దని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలను చేర్పించడం ద్వారా చదువుతో పాటు పోషణపై ప్రత్యేక శ్రద్ధ వహించవచ్చని తెలిపారు. లోప పోషణ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ, శుక్రవారం సభల ప్రారంభం నుంచి మహిళల ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.


