గ్రామాభివృద్ధికి సర్పంచులే పునాది
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
రాజాపూర్ సర్పంచ్, వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక
కాకతీయ, కరీంనగర్ : గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. భేషజాలకు పోకుండా వార్డు సభ్యులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
శుక్రవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో తిమ్మాపూర్ మండలం రాజాపూర్ గ్రామ సర్పంచ్ (స్వతంత్ర) కొంకటి రవి, వార్డు సభ్యులు గాజుల మహేందర్, కుక్కల రాజమ్మ, రెడ్డి భారతి, మాతంగి వేణుతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ వారందరికీ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన నాయకులు కాంగ్రెస్ కుటుంబంలో భాగమవడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అమలులో నూతనంగా చేరిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అందరి భాగస్వామ్యంతోనే గ్రామాలు ముందుకు సాగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు కుర్ర ఓదెలు, గుడిపాటి శ్రీనివాస్ రెడ్డి, గట్టు తిరుపతి, బండారు తిరుపతి, గొట్టె మధు, మధుకర్, గాజుల మహేశ్, రాయిని రమేశ్, జనగాం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.


