గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి
ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా
హామీలు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు : జి. నాగయ్య హెచ్చరిక
కాకతీయ, ఖిలావరంగల్ : జక్కలొద్దీ రామ సురేందర్ నగర్ గుడిసె వాసులందరికీ తక్షణమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, లేదంటే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించాలని సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ జి. నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఖిలా వరంగల్ సీపీఎం కార్యదర్శి నలిగంటి రత్నమాల అధ్యక్షత వహించగా, కామ్రేడ్ రామసందీప్ తదితరులు దీక్షలు ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కామ్రేడ్ జి. నాగయ్య మాట్లాడుతూ… ప్రభుత్వాలు మారుతున్నా పేదల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదని విమర్శించారు. నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా గుడిసెల్లోనే నివసిస్తూ వర్షాలు, ఎండలు, విషజంతువుల భయం మధ్య గడుపుతున్న పేద కుటుంబాలకు కనీస మౌలిక వసతులు కూడా కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన హామీలు కూడా ఇప్పటివరకు అమలుకాలేదని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లు గానీ, ఇళ్ల పట్టాలు గానీ గుడిసె వాసులకు అందలేదన్నారు. పేదల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కేరళలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఉదాహరణగా పేర్కొంటూ, తెలంగాణలో కూడా అదే తరహాలో పేదలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నలిగంటి రత్నమాల మాట్లాడుతూ… గుడిసె వాసులకు వెంటనే పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలని, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, గుడిసె వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


