ఆరు గ్యారంటీలు అమలు కాలేదు
సీఎం రేవంత్ నిరూపిస్తే రాజీనామా చేస్తా
లేకపోతే సీఎం పదవి వదులుతారా..?
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో ఈ హామీలు అమలవుతున్నాయని చెప్పడం పచ్చి అబద్ధమని పేర్కొంటూ, అవి నిజమైతే నిరూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూటిగా సవాల్ విసిరారు. గ్యారంటీలు అమలవుతున్నాయని మీరు నిరూపిస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, అమలు కాలేదని తాను నిరూపిస్తే సీఎం పదవి వదులుతారా అని ప్రశ్నించారు. మహిళలకు రూపాయలు 2500, తులం బంగారం, స్కూటీ, వృద్ధులకు రూపాయలు 4000 పెన్షన్, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు భరోసా కార్డు, రైతులకు భరోసా వంటి హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
క్షేత్రస్థాయి పరిశీలనకు సవాల్
కేరళ మీడియాను వెంట తీసుకుని తెలంగాణలో ఏ గ్రామానికైనా వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలిద్దామని సంజయ్ సూచించారు. గతంలో ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు కేరళలో కూడా అదే ప్రచారం కొనసాగుతోందని విమర్శించారు. రైతు భరోసా పరిమితి, నిరుద్యోగ భృతి, ఆసరా పెన్షన్ పెంపు, విద్యార్థుల భరోసా కార్డు అమలు వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఉద్యోగులకు డీఏలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని ఆరోపించారు. హుజూరాబాద్ గడ్డపై నుంచి విసిరిన ఈ సవాల్‌కు ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేస్తూ, ప్రజలు, మీడియా క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.


