కేసీఆర్‌పై సిట్ నోటీసులు రాజకీయ కక్షే!
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ డ్రామాలు
బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు డా. బానోత్ సారంగపాణి
కాకతీయ, నల్లబెల్లి : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి *కేసీఆర్*కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్లబెల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు డా. బానోత్ సారంగపాణి మాట్లాడుతూ… ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పక్కదారి పట్టిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చి, విచారణ పేరుతో కేసీఆర్‌ను వేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకే సిట్ నోటీసుల డ్రామాకు తెరలేపిందని విమర్శించారు. రైతులు, యువత, మహిళలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల పరిస్థితిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. నోటీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తే బీఆర్‌ఎస్ శ్రేణులు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


