సార్ సెలవ్ మీద! సాఫ్ట్‌వేర్ అలక మీద!
ఏనుమాముల మార్కెట్‌కు సాంకేతిక గండం!
పత్తి యార్డులో నిలిచిన కాంటాలు
ఎప్పటికి జరుగుతాయో తెలియని వైనం
కాకతీయ, వరంగల్ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సాఫ్ట్‌వేర్ సమస్య వచ్చిపడింది. దీంతో పత్తియార్డులో కాంటాలు నిలిచిపోయాయి. రైతులు ఆందోళన చెందాల్సిన దుస్థితి నెలకొంది. దసరా నేపథ్యంలో మార్కెట్‌కు వరుస సెలవుల తర్వాత సోమవారమే లావాదేవీలు ప్రారంభమయ్యాయి. అయితే, పండుగ తర్వాత తెరుచుకున్న మార్కెట్‌కు సాఫ్ట్‌వేర్ రూపంలో సమస్య వచ్చిపడింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకపోవడం వల్ల కాంటాలు నిలిచిపోయాయి. దీంతో రైతులు మార్కెట్ కార్యాలయం వద్ద సమాధానం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఎప్పుడైనా ఒక రోజు ముందే సాఫ్ట్‌వేర్‌ను సరిచేసుకోవాలి. కానీ, వరుస సెలవులు వచ్చాయని అధికారులు ఈ విషయాన్ని విస్మరించినట్టున్నారు.

తీరా.. మార్కెట్ ప్రారంభమయ్యాక కాంటాలు వేయబోతే.. మొరాయించడంతో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదని పేర్కొనడం.. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఇదిలా ఉండగా, మార్కెట్ కార్యదర్శి జి.రెడ్డి సెలవుపై వెళ్లినట్లు తెలుస్తుండగా, గ్రేడ్ 2 కార్యదర్శులు ఇప్పుడు హైరానా పడాల్సిన దుస్థితి నెలకొంది. మార్కెటింగ్ శాఖ జిల్లా ఉన్నతాధికారులైనా దగ్గరుండి ఈ సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే.. సాఫ్ట్‌వేర్ అలక తీరేదాకా.. లావాదేవీలు ఆరంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది.



