పాపం పండింది
భార్య, ఇద్దరు కుమార్తెల హత్యకేసులో భర్త అరెస్ట్
ఆయనతో పాటు మరో 9 మంది..
స్విమ్మింగ్ పూల్లో ముంచి ముగ్గురి మర్డర్
ప్రేమ కోసం పిశాచంగా
మరో పెళ్లి కోసమే దారుణం
టెక్నాలజీతో కేసు ఛేదించిన పోలీసులు
పరారీలో మరో ఇద్దరు నిందితులు
కాకతీయ, హనుమకొండ : వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన భార్య, ఇద్దరు పిల్లల హత్య కేసును పోలీసులు ఛేదించారు. భర్యే నిందితుడు అని తేల్చారు. ప్రధాన నిందితుడు అజారుద్దీన్తోపాటు అతని కుటుంబ సభ్యులు, వైద్యులు, నర్సులు కలిపి మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం… ఆడ పిల్లలను జన్మనిస్తుందనే అపనమ్మకం, అలాగే మరో యువతిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో కట్టుకున్న భర్త తన భార్యతోపాటు ఇద్దరు చిన్నారులను హత్య చేసిన ఘటన ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ఎండీ అజారుద్దీన్ తన భార్య ఫరహాత్ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా, ఆయేషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కుమారుడు పుట్టాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతోపాటు, ఫరహాత్ గర్భం దాల్చిన ప్రతిసారి ఆడ శిశువే పుడుతుందని అనుమానంతో బలవంతంగా రెండుసార్లు గర్భస్రావం చేయించారు. ఇదే సమయంలో నిందితుడు ఓ మైనర్ బాలికపై ప్రేమ పెంచుకుని, ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు.
అడ్డు తొలగించాలనుకొని..
కానీ ఇప్పటికే భార్య, పిల్లలు ఉన్నందున ఆ బాలిక నిరాకరించడంతో, వారిని అడ్డంకిగా భావించి హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈనెల 1వ తేదీ రాత్రి ఐస్క్రీమ్ తినిపిస్తానని చెప్పి భార్య, పిల్లలను తన స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. ముందుగానే సీసీ కెమెరాలు, విద్యుత్ నిలిపివేసి, ముగ్గురిని బలవంతంగా నీటిలోకి నెట్టి హత్య చేశాడు. అనంతరం ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈకేసులో ప్రధాన నిందితుడు అజారుద్దీన్తోపాటు అతని కుటుంబ సభ్యులు, వైద్యులు, నర్సులు కలిపి మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని పోలీస్ కమిషనర్ అభినందించారు.


