కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన విద్యార్థిని మరణించింది. బంధువులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..సిద్ధిపేట జిల్లా రామారుకల గ్రామానికి చెందిన శ్రీనివాస్ వర్మ, హేమలత దంపతులకు శ్రీజా, శ్రేయా అనే ఇద్దరు కూతురులు ఉన్నారు. శ్రీనివాస్ వర్మ దంపతులు కొన్నేళ్ళ క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు. మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా సమీపంలో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్ వర్మ డ్రైవర్ గా పనిచేస్తుండగా..ఆయన భార్య ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు.
వీరి పెద్ద కూతురు శ్రీజా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. ఈ మధ్యే ఎంఎస్ పూర్తి చేసుకుంది. సోమవారం రాత్రి అపార్ట్ మెంట్ నుంచి బయటకు వచ్చి భోజనం చేసేందుకు కారులో రెస్టారెంట్ కు వెళ్లింది. భోజనం చేసి తిరిగి వస్తున్న క్రమంలో ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీజ తీవ్రంగా గాయపడి మరణించింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో శ్రీజ స్నేహితురాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీనివాస్ వర్మ చిన్న కూతురు శ్రేయా కూడా ఎంఎస్ చేసేందుకు 20 రోజుల క్రితం అమెరికాకు వెళ్లింది.


