మల్లంపల్లి సర్పంచ్ అభ్యర్థిగా శ్యామ్ రావు నామినేషన్
కాకతీయ, ములుగు ప్రతినిధి : మల్లంపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ల్యాద శ్యామ్ రావు మంగళవారం అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. మండల కేంద్రంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రానికి శ్యామ్ రావు భారీ స్థాయిలో మహిళలు, కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన ర్యాలీతో చేరుకున్నారు. జాతీయ రహదారిపై నినాదాల మధ్య శ్యామ్ రావు మరోసారి నామినేషన్ పత్రాలు సమర్పించారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న మల్లంపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరవేయడంలో తాను కీలక పాత్ర పోషిస్తానని శ్యామ్ రావు తెలిపారు. గ్రామ సమస్యలపై తనకున్న అవగాహనతో సమగ్ర అభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తనకు ఆశీర్వాదం అందిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో ఎన్నికల వేడి ప్రాంతీయంగా మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.


