ఎన్నికల కోడ్‌లో విజయోత్సవాలా?
సీఎం రేవంత్‌పై సుంకే రవిశంకర్ ఫైర్
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహించడం స్పష్టమైన ఉల్లంఘన అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ వర్తించదా? అంటూ ప్రశ్నించారు.పంచాయతీ ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో ప్రజాధనాన్ని ఖర్చు చేసి, ముఖ్యమంత్రిగా బాధ్యతలను పక్కన పెట్టి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం ఎక్కడైనా జరిగిందా అని ఎద్దేవా చేశారు.హుస్నాబాద్‌లో జరిగిన విజయోత్సవ సభకు గ్రామాల నుంచి ప్రజలను, స్కూల్ విద్యార్థులను తరలించడం ప్రజాస్వామ్యానికి అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చకుండానే విజయోత్సవాలు చేసుకోవడం హాస్యాస్పదమని విమర్శించారు. ప్రజల డబ్బుతో రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలను ముందుగా అమలు చేసి తర్వాతే విజయోత్సవాలు చేసుకోవాలని డిమాండ్ చేశారు.వెంటనే జోక్యం చేసుకుని విజయోత్సవ సభలను నిలిపివేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. సమావేశంలో తిరుమల్ రావు, విజేందర్ రెడ్డి, తిరుపతి, సత్తినేని శ్రీనివాస్, నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.


