కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి మరణించాడు. ఎల్బీనగర్ పరిధిలోని బీఎన్ రెడ్డినగర్ కు చెందిన పోలే చంద్రశేఖర్ 2023లో బీడీఎస్ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. ఇవాళ తెల్లవారుజామున డల్లాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో చంద్రశేఖర్ మరణించాడు.
బీఎన్ రెడ్డి నగర్ లో ఉన్న బాధిత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితోపాటు మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించాడు. ఉన్నత స్థానంలో ఉంటాడనుకున్న కుమారుడు లేడన్న సంగతి తెలిసి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన చూసి గుండె తరుక్కుపోతుందన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
చంద్రశేఖర్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని మరణం ఆవేదన కలిగించిందన్నారు. మ్రుతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ భౌతికకాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.



