షాకిస్తున్న సిద్ధరామయ్య వాచ్ ధర.. మళ్లీ వివాదంలో కర్ణాటక సీఎం!
మరోసారి వివాదంలో సిద్ధరామయ్య
సోషలిస్టు నేత చేతికి లక్షలు విలువైన కార్టియర్ వాచ్
కర్ణాటక సీఎంను నిలదీస్తున్న ప్రతిపక్షాలు
కాకతీయ, నేషనల్ డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తన లగ్జరీ వాచ్ కారణంగా వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి ఆయన చేతిలో కనిపించిన వాచ్ ‘శాంటోస్ డి కార్టియర్’ మోడల్. నిపుణుల ప్రకారం దాని ధర రూ. 43.2 లక్షలు.18 క్యారెట్ల రోజ్ గోల్డ్‌తో తయారైన ఈ వాచ్, ఖరీదులో మాత్రమే కాదు, డిజైన్ పరంగా కూడా అత్యంత ప్రత్యేకమైన మోడల్. ఇదే వాచ్ ఇప్పుడు రాజకీయంగానూ పెద్ద చర్చకు కారణమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మంగళవారం ఉదయం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఇద్దరి చేతులకు కార్టియర్ బ్రాండ్ వాచ్‌లు ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా, మీడియా ఫోకస్ మొత్తం సిద్ధరామయ్య చేతి వాచ్‌పైనే కేంద్రీకృతమైంది. ఆయన శాంటోస్ డి కార్టియర్ మోడల్‌ను ధరించారు. తనను తాను సోషలిస్టు, పేదల పక్షపాతి నేతగా అభివర్ణించుకునే ఆయన.. ఏకంగా రూ. 43 లక్షల 20 వేలు ఖరీదు చేసే వాచ్ ధరించడం విమర్శలకు దారితీసింది.
ఇలాంటి సమస్యలు ఆయన రాజకీయ జీవితంలో కొత్తవి కాదు. 2016లోనూ సిద్ధరామయ్య హుబ్లో వాచ్ కారణంగా తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. రూ. 50–70 లక్షల విలువైన వజ్రాల పొదిగిన వాచ్ ధరించడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పేదల పక్షపాతిగా చెప్పుకునే నేత ఇంత ఖరీదైన వస్తువులను ధరించడం ఎందుకు అని ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో.. సిద్ధరామయ్య ` ఆ వాచ్ దుబాయ్‌లోని స్నేహితుడు ఇచ్చిన సెకండ్ హ్యాండ్ మోడల్` అని వివరణ ఇచ్చారు.
అయితే ఇప్పుడు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. కార్టియర్ వాచ్ కారణంగా అదే తరహా విమర్శలు, సోషల్ మీడియాలో హాట్ చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ప్రతిపక్షలు నేరుగా ఆయన్ను టార్గెట్ చేసి నిలదీస్తున్నాయి. ఏదేమైనా పేదల పక్షపాతి నేత ఇంత ఖరీదైన వాచ్ ధరించడం అనేది ఆయన రాజకీయ ప్రతిష్ఠకు, పేదలలో నమ్మకానికి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


