హిందూ సమాజానికి స్ఫూర్తి శివాజీ
ఇనుగుర్తిలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
కాకతీయ, ఇనుగుర్తి : హిందూ సమాజానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తిలో గురువారం శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ దేశభక్తి, ధైర్యసాహసాలు, స్వరాజ్య సాధన కోసం శివాజీ మహారాజ్ చేసిన పోరాటం ప్రతి భారతీయుడికి ఆదర్శమని అన్నారు. “ముందు దేశం, తర్వాత గురువు, అనంతరం తల్లిదండ్రులు” అనే మహత్తర సిద్ధాంతంతో శివాజీ ముందుకు సాగారని తెలిపారు. 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని పూణే జిల్లా జున్నూర్ సమీపంలోని శివనేరి కోటలో జన్మించిన శివాజీ మహారాజ్, స్వరాజ్య స్థాపన కోసం చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని కొనియాడారు. ఆయన జన్మదినాన్ని హిందూ సామ్రాజ్య దినోత్సవంగా దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ శౌర్యం, పరాక్రమం ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచాయని, యువత ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వల్లముల రాజేందర్ యాదవ్, నద్దునూరి ప్రశాంత్, లింగాల సందీప్, మట్టపల్లి హరీష్, పెండ్లి మహేందర్, గణేష్, వీరన్న, నవీన్, రోహిత్, రాజేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


