అనుమతులు లేకుండా షిఫ్టింగ్
వాగ్దేవి కాలేజీపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాల డిమాండ్
కాకతీయ,హుజురాబాద్: హుజురాబాద్‌లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల యాజమాన్యం అనుమతులు లేకుండా కళాశాల భవనాన్ని తరచుగా మార్చుతూ విద్యార్థులను అయోమయంలోకి నెట్టేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పరీక్షల సమయంలో కూడా ఎటువంటి షిఫ్టింగ్ అనుమతి లేకుండా కళాశాల యాజమాన్యం డీసీఎంఎస్ కాంప్లెక్స్‌లోని పాత జాగృతి కళాశాల భవనంలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండటాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ విషయం పై యూనివర్సిటీ అధికారులు కనీసం స్పందించకపోవడం విచారకరమని అన్నారు.హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ( ఏఐఎస్బి) రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యుడు కొలుగూరి సూర్యకిరణ్, అఖిలభారత విద్యార్థి సమాఖ్య ( ఏఐఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేశ్ మాట్లాడుతూ.వాగ్దేవి కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తోంది. పరీక్షల సమయంలో సెంటర్ మార్చడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమే అని విమర్శించారు.
శాతవాహన యూనివర్సిటీ అధికారులు తక్షణమే విచారణ జరిపి కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూనివర్సిటీ, కాలేజీ యాజమాన్యాలపై తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేశ, బోయిన రాము, యాదవ్ భరత్, నవీన్, సాయి, సందీప్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


