యజమాని వేధింపులకు గొర్రెల కాపరి బలి
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో ఘటన
కాకతీయ,రాయపర్తి :యజమాని వేధింపులు భరించలేక బలవన్మరణానికి యత్నించిన గొర్రెల కాపరి ఆకారపు నర్సయ్య (55) చికిత్స పొందుతూ ఆదివారం ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.వివరాల్లోకెలితే వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఆకారపు నర్సయ్య గత కొంతకాలంగా అడ్లురి శ్రీనివాసరావు వద్ద గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు.ఈ క్రమంలోనే ఇటీవల కొన్ని రోజులుగా యజమాని అతడిని పని విషయంలో తీవ్రంగా దూషిస్తూ,మానసిక వేదనకు గురిచేసేవాడని సమాచారం.ఈ అవమానాన్ని భరించలేక మనస్తాపం చెందిన బాధితుడు డిసెంబర్ 30వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యులు వెంటనే గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.ఈ నేపథ్యంలో పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందాడని పేర్కొన్నారు.యజమాని వేధింపులే తన భర్త మరణానికి కారణమని మృతుడి భార్య ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు.


