పెళ్లి రోజునే షేక్ హసీనాకు మరణశిక్ష..
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత!
నవంబర్ 17 హసీనా జీవితాన్ని మార్చిన రోజు
పెళ్లి రోజునే మరణశిక్ష
ఐసీటీ తీర్పునకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన హసీనా వర్గం
కాకతీయ, జాతీయం : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT) విధించిన మరణశిక్ష దేశం మొత్తాన్ని కుదిపేస్తుంది. బంగ్లాదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా చోటుచేసుకున్న హింసాత్మక నిరసనలు, దాడులు, రాజకీయ అల్లర్లలో హసీనాకి సంబంధం ఉందని ట్రైబ్యునల్ తేల్చింది. విచారణలో కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించడంతో, ఐసీటీ నేరుగా మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును హసీనా వర్గం పూర్తిగా రాజకీయ ప్రేరేపిత నిర్ణయంగానే అభివర్ణిస్తోంది.
ఈ తీర్పు వెలువడిన నవంబర్ 17 తేదీ హసీనాకు ప్రత్యేకమైనది. నవంబర్ 17 హసీనా పెళ్లి రోజు. 1967లో అదే రోజున ఆమె తన భర్త డా. ఎం.ఎ. వాజేద్ మియాతో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో, ఆమె పెళ్లి సన్నిహితుల సమక్షంలోనే అత్యంత రహస్యంగా జరిగింది. పెళ్లి పూర్తయ్యాక ఆమె తన తండ్రి ఆశీర్వాదం కోసం నేరుగా జైలుకే వెళ్లింది. ఆ రోజు జీవితాంతం చిరస్మరణీయంగా నిలిచిపోయినప్పటికీ… ఇన్నేళ్ల తరువాత అదే తేదీన మరణశిక్ష విధించబడటం విధి వింతగా మారింది.
ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్‌లో విచారణ వేగంగా సాగగా.. కోర్టు హసీనాపై ఉన్న అన్ని ఆరోపణలను ధృవీకరించింది. ఆమెపై నమోదైన కేసులు గతంలో జరిగిన అల్లర్లు, ప్రాణ నష్టం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి అంశాలకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో హసీనాకు మరణశిక్ష విధించడం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘటనగా నిలిచింది. తీర్పు వెలువడిన వెంటనే హసీనా మద్దతుదారులు ఆగ్రహంతో వీధుల్లోకి వచ్చారు. రాజధాని ఢాకా సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఐసీటీ తీర్పునకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిస్తూ రెండు రోజులపాటు బంద్ ప్రకటించింది అవామీ లీగ్. దాంతో దేశంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, ఈ తీర్పు వెనుక రాజకీయ కోణం ఉన్నట్టుగా అనేక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హసీనా ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్య జరిగిందని కొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, హసీనావర్గం ఈ మరణశిక్షపై ఉన్నత న్యాయస్థానం ముందు అప్పీల్‌కి సిద్ధమవుతోంది. ఈ పరిణామాల నడుమ మరణశిక్ష అమలవుతుందా? లేక రాజకీయ మలుపులు ఈ కథను మరో దిశగా తీసుకెళ్తాయా? అన్నది చూడాలి.


