షేక్ హసీనాకు మరణశిక్ష
ఢాకా కోర్టు సంచలన తీర్పు
ఆమె తీరు మానవత్వానికి మచ్చ అంటూ ఆగ్రహం
అమాయకులను కాల్చిచంపాలని ఆదేశాలు ఇచ్చారన్న కోర్టు
ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి శిక్ష ఖరారు
విద్యార్థుల ఆందోళనలతో వదులుకున్న ప్రధాని పీఠం
ప్రస్తుతం భారత్‌లో హసీనా ఆశ్రయం
ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివాసం
తీర్పు నేపథ్యంలో ఢాకాలో హైఅలర్ట్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకాలోని ప్రత్యేక ట్రైబ్యునల్ మరణ శిక్ష విధించింది. ఆమెపై దాఖలైన హత్యానేరం కేసుల్లో ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇదే కేసులో బంగ్లాదేశ్ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు కూడా మరణ శిక్ష విధించిన ప్రత్యేత ట్రైబ్యునల్, అప్పటి పోలీస్ చీఫ్ చౌధురి అబ్దుల్లాకు ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. మానవత్వం లేకుండా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ సో మవారం ఆమెను దోషిగా తేల్చింది. మరోవైపు ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ముఖ్యంగా రాజధాని ఢాకాలో హైఅలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు జారీ చేశారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు.
నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ..
గత ఏడాది జులై-ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా ఢాకాలో విద్యార్థుల చేపట్టిన ఆందోళనల సమయంలో వారిని చంపేయమని షేక్ హసీనా ఆదేశాలు జారీ చేశారని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించేలా షేక్ హసీనా పోలీసులు, సైన్యాన్ని ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. గాయపడినవారికి వైద్యం అందించేందుకు కూడా ఆమె నిరాకరించారని తెలిపారు. షేక్ హసీనా అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలని కోరారు.
దిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివాసం
విద్యార్థుల ఆందోళనలతో..
విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యరీతిన ప్రధానమంత్రి పీఠం నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. నాటినుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తూ, అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తీర్పుకు ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేసిన ఆమె, ఎవరూ బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు. “నేను బతికే ఉన్నాను. ఉంటాను. ప్రజల సంక్షేమం కోసం నా పనిని ప్రారంభిస్తాను. వాళ్లు ఏ తీర్పు అయినా ఇవ్వనివ్వండి. నాకు సంబంధం లేదు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఆయనే తీసుకుంటాడు. అప్పటివరకు నా ప్రజల కోసం పనిచేస్తాను. ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు, తోబుట్టువులను పోగొట్టుకున్నాను. వారు నా ఇంటిని కాల్చివేశారు. గోనో భవన్ (బంగ్లా ప్రధానమంత్రి అధికారిక నివాసం) నా ఆస్తి కాదు. అది ప్రభుత్వానిది. నేను దేశం వీడిన తర్వాత దానిలో లూటీ జరిగింది. అది విప్లవం అని వారు చెప్తున్నారు. గూండాలు, ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరు.” అని హసీనా మండిపడ్డారు.


