కాకతీయ, గీసుగొండ : గొర్రె పొట్టేళ్ల దొంగతనాలపై గీసుగొండ పోలీసులు కట్టుదిట్టమైన నిఘా ఉంచి నిందితుడిని పట్టుకున్నారు. సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నెల రోజులుగా గీసుగొండ, ఆత్మకూరు, దుగ్గొండి, దామెర మండల పరిధిలో వరుసగా గొర్రె పొట్టేళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాల వెనుక కాజీపేటకు చెందిన బండ వరుణ్, వరంగల్ చెందిన అన్నెబోయిన గణేష్ అనే ఇద్దరు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలగా శుక్రవారం బండ వరుణ్ ఒక కారులో 10 గొర్రె పొట్టేళ్లను తరలిస్తుండగా ఊకల్ క్రాస్ వద్ద గీసుగొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు గతంలో కూడా పలుచోట్ల గొర్రె పొట్టేళ్లను దొంగిలించి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుండి 10 గొర్రె పొట్టేళ్లు, ఒక కారు, రూ.60 వేల నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. మరో నిందితుడు అన్నెబోయిన గణేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


