గొర్రెల దొంగతనాల ముఠా అరెస్టు
గీసుగొండ పోలీసులను ప్రశంసించిన ఏసీపి వెంకటేష్
కాకతీయ, గీసుగొండ: గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న గొర్రెల దొంగతనాలపై దర్యాప్తు జరిపిన గీసుగొండ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు దొంగతనాలకు నేరుగా పాల్పడగా, వారికి సహకరించిన మాంస వ్యాపారి ఒకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ.1,60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మామునూరు ఏసీపి వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు గతంలో ఇండ్లతాళాలు పగలగొట్టి చోరీలు,ద్విచక్రవాహన దొంగతనాలు చేస్తూ పలుమార్లు జైలుకు వెళ్లారు. జైలు నుంచి బయటకొచ్చాక తమ పాత పద్ధతులు పోలీసులు త్వరగా గుర్తిస్తున్నారని భావించి, గ్రామాల్లో గొర్రెలను లక్ష్యంగా చేసుకున్నారు. రాత్రివేళల్లో సెల్ఫ్ డ్రైవ్ కారులను అద్దెకు తీసుకుని ముందుగా రెక్కీ చేసిన గ్రామాలకు వెళ్లి గొర్రెలను ఎత్తుకెళ్లి, వాటిని వర్ధన్నపేటకు చెందిన మాంస వ్యాపారి వెంకన్నకు విక్రయించేవారు.ఈ ముఠా గీసుగొండ,మామూనూర్, మిల్స్ కాలనీ, మడికొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు గొర్రెల దొంగతనాలకు పాల్పడటం తో పాటు, కొమ్మాల శివారులో ఓ ఇంటి నుంచి రూ.1,05,000, బొల్లికుంటలో రెండు ఇండ్లలో నగదును చోరీ చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో టెక్నాలజీ సాయంతో నిందితుల కదలికలను పర్యవేక్షించిన పోలీసులు ఊకల్ హవేలీ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీల సందర్భంగా రెండు అనుమాస్పద కార్లను ఆపి పరిశీలించారు.కార్లలో గొర్రెల మలం, జుట్టు గుర్తించడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాలను అంగీకరించడంతో నగదును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.
నిందితులను పట్టించడంలో విశేష కృషి చేసిన ఇన్‌స్పెక్టర్ డి. విశ్వేశ్వర్, ఎస్‌ఐ కె. కుమార్, కానిస్టేబుళ్లను మామూనూర్ ఏసీపీ వెంకటేశ్ అభినందించి తగిన శాఖపరమైన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.


