- ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం
- తుఫాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంట నీటిపాలు
- వేల ఎకరాల్లో దెబ్బతిన్న వరి, పత్తి ..
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిమద్దైన వరిధాన్యం
- ప్రకృతి కన్నెర్రతో కన్నీరు మున్నీరవుతున్న రైతులు
- ఆదుకోవాలని ప్రభుత్వానికి వేడుకోలు
- 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా..
- నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి తుమ్మల భరోసా
- ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటన

కాకతీయ, తెలంగాణ బ్యూరో : ఆరుగాలం చేసిన కష్టం వర్షార్పణం అయింది. చేతికొచ్చిన పంట తుఫాన్ వల్ల నేల రాలింది. తుఫాన్ వల్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసింది. కొన్ని చోట్ల ధాన్యం మొలకలు వస్తున్నాయి. కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టడం, దగ్గరపోయడం రైతులకు సవాల్‌గా మారింది. మోంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వానలకు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. వేల ఎకరాల్లో వరి, పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నది. చేతికొచ్చిన పంట నీట మునగడం, కళ్లముందే ధాన్యం నీటిపాలవడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
నేలకొరిగిన పంట చేన్లు

తుఫాన్ ప్రభావం వల్ల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పంటలు నేలకొరిగాయి. ముఖ్యంగా వరి పంట కోత సమయంలో నేలరాలడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. వరి కోయడానికి తడిగా ఉండటంతో మిషన్లతో కోయడానికి వీలు కావడంలేదు. చైన్ మిషన్ల ద్వారా రైతులు వరికోతలు కోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కోపించిన పచ్చి ధాన్యాన్ని ఆరబెట్టడంలో రైతులు ఇబ్బందిపడుతున్నారు. ధాన్యం పచ్చిగా ఉండడంతో మొలకలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. అప్పుడు ఎరువులు, విత్తనాలు సకాలంలో దొరకక సాగు ఇబ్బంది అయిందని.. ఇప్పుడేమో చేతికి వచ్చిన పంట అమ్ముకుందామంటే ప్రకృతి కన్నెర్ర జేయబట్టే అని కన్నీరు మున్నీరవుతున్నారు.
ఆదుకుంటాం : తుమ్మల

తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ. 10వేల చొప్పున అందిస్తామన్నారు. 4.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. పశు సంపద, ఇల్లు నష్టపోయినా ఆదుకుంటామని చెప్పారు. 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రేపటి నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తారని, నష్టపోయిన ప్రతి రైతు పంట వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని ఆదేశించారు. 11 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అధిక వర్షాలతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకుంటాం. కేంద్రం సహకరించకపోయినా ప్రతి రైతుకు అండగా నిలుస్తాం. గత ఏడాది వరదల్లోనూ భారీగా నష్టం జరిగినా కేంద్రం సాయం చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక సమర్పించినా స్పందించలేదు అని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు.


