శాస్త్రి సేవలు చిరస్మరణీయం
జై జవాన్–జై కిసాన్‌తో దేశానికి దిశానిర్దేశం
ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్
కాకతీయ, ఇనుగుర్తి : దేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ అన్నారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శాస్త్రి వర్ధంతిని గ్రామంలో ఘనంగా నిర్వహించారు.
గ్రామపంచాయతీ ఆవరణలోని శాస్త్రి విగ్రహానికి సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, సంఘం అధ్యక్షుడు పప్పుల వెంకన్నతో పాటు వివిధ పార్టీల నాయకులు, సంఘ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తమ్మడపల్లి కుమార్ మాట్లాడుతూ, “జై జవాన్–జై కిసాన్” నినాదంతో దేశ ప్రజలను చైతన్యపరిచి, యుద్ధ సమయంలో ధైర్యసాహసోపేతమైన వ్యూహాలతో దేశాన్ని నడిపించిన మహానేత శాస్త్రి అని కొనియాడారు. నిరాడంబర జీవనం గడుపుతూ భారత ప్రధానిగా సేవలందించిన ఆయన ప్రతి భారతీయుడికి ఆదర్శప్రాయుడన్నారు. శాస్త్రి చూపిన విలువలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదగిరి, వార్డు సభ్యులు వేముల శ్రీనివాస్, బూర ఇస్తారి, దేవులపల్లి వెంకన్న, రామ్ సలీం, నాయకులు బొబ్బిలి మహేందర్ రెడ్డి, దార్ల రామ్మూర్తి, చిన్నాల కట్టయ్య యాదవ్, పప్పుల వెంకన్న (టీచర్), దుంపల సందీప్, గడ్డం వెంకన్న, వల్లంల మురళి, డా. వెంకటేశ్వర్లు, గాడుదల రాజాలు, ఉమ్మగాని మధు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


