శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన శిక్షలు
టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి హెచ్చరిక
కాకతీయ, మహబూబాబాద్ : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం, రాజకీయ ఉద్రిక్తతలను సృష్టించే చర్యలకు పాల్పడటం చట్ట విరుద్ధమని మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం రాత్రి కొంతమంది వ్యక్తులు రాజకీయ ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఉద్దేశంతో మాజీ డిసిసి అధ్యక్షులు జిన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి నివాస గేటుకు బీజేపీ పార్టీ జెండాలను కట్టారు. అలాగే, రాజకీయ వర్గాల మధ్య విబేధాలను కలిగించే వ్యాఖ్యలు ప్రచారం చేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ఘటన శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున, పోలీసులు సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. అయితే, భవిష్యత్తులో ఎవరికైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తే, వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు. ప్రజలను ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేపడుతున్న ప్రయత్నాలకు సహకరించాలని ఆయన కోరారు


