చలి తీవ్రత సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఇబ్బందులు
దుప్పట్లు, వేడి నీటి సదుపాయం కల్పించండి
ఏఐఎస్ఎఫ్ డిమాండ్
కాకతీయ, హుజురాబాద్: చలి తీవ్రత పెరగడంతో ప్రభుత్వ సంక్షేమ, బీసీ, ఎస్సీ, గురుకుల హాస్టళ్లలో విద్యార్థులు గడ్డకట్టే పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామారపు వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు జ్వరాలు, అనారోగ్య సమస్యలకు గురవుతున్న నేపథ్యంలో వెంటనే దుప్పట్లు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో హాస్టల్ వార్డెన్లు హాస్టల్‌లోనే అందుబాటులో ఉండి స్టడీ అవర్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చలికాలంలో నీరు గడ్డకట్టేంత చల్లగా రావడంతో విద్యార్థులు వేడి నీటి లభ్యత లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకే హాస్టళ్లలో తక్షణమే వేడి నీటి సదుపాయం ఏర్పాటు చేయాలని సూచించారు.కొన్ని హాస్టళ్లలో గదుల కిటికీలకు మేస్ జాలీలు లేకపోవడం, మంచాలు సరిపడా అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని వెంకటేష్ తెలిపారు. కలెక్టర్ చొరవ తీసుకుని దుప్పట్లు, మంచాలు, జాలీలు వంటి ప్రాథమిక వసతులను వెంటనే అందేలా చూడాలని కోరారు.గతంలో మాదిరిగా ఈ ఏడాది కూడా విద్యార్థులకు దుప్పట్లు, వేడి నీళ్లు అందించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరుతూ.. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, రామారపు నాని, శివారెడ్డి, భాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


