డెబ్భై యేండ్ల చరిత్ర.. వేలాది జర్నలిస్టుల విశ్వాసం.!
ఐక్యత, పోరాటాలు, త్యాగాల పునాదులపై సంఘం నిర్మితం..
జర్నలిజం వృత్తిని పరిరక్షించేందుకు పోరాటాలు ..
టీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : దాదాపు డెబ్భై యేండ్ల సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగివుండి, రాష్ట్రంలో వేలాది జర్నలిస్టుల విశ్వాసం చూరగొంటున్న ఘనత దేశంలో తమ సంఘానికి మాత్రమే దక్కిందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కే.విరాహత్ అలీ స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే సంఘం కార్యకలాపాలకు ఆకర్షితులై, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు ఇవ్వాళ బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయానికి తరలివచ్చి విరాహత్ అలీ సమక్షంలో యూనియన్ సభ్యత్వాలు తీసుకున్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఐక్యత, పోరాటాలు, త్యాగాల పునాదులపై తమ సంఘం నిర్మితమైందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల పేరుతో లెటర్ హెడ్ లు, విజిటింగ్ కార్డులు సృష్టించి, పైరవీలు చేసుకుంటూ పబ్బం గడుపుకునే సంఘాలను జర్నలిస్టులు గుర్తించి, వారిని తిరస్కరిస్తూ, తమ సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న టీయూడబ్ల్యూజే-ఐజేయూ సంఘం జెండా పట్టుకొని కదం తొక్కుతున్నట్లు విరాహత్ అలీ అన్నారు.
ప్రశ్నర్థకంగా మీడియా భవిష్యత్తు ..
కొన్ని అరాచక శక్తుల చర్యల మూలంగా ప్రస్తుతం మీడియా భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారిందని, పవిత్రమైన జర్నలిజం వృత్తిని పరిరక్షించేందుకు పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాలమూరు జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమాన్ని విస్తరింపజేయడంలో తమ సంఘం దివంగత నేతలు రఘురామయ్య, హన్మంత్ రెడ్డిల కృషి చిరస్మరనీయమన్నారు. జిల్లాల విభజనకు ముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో తమ సంఘం సభ్యత్వాలు 400వరకు ఉంటే, జిల్లాల విభజన తర్వాత దాదాపు 1400కు చేరడం బట్టి చూస్తే తమ సంఘం పట్ల జర్నలిస్టులకు ఉన్న విశ్వాసాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని విరాహత్ తెలిపారు. 31జిల్లాల్లో తమ సంఘానికి ఇలాంటి ఆదరణే ఉందని ఆయన స్పష్టంచేశారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి, కోశాధికారి మోతె వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏ. రాజేష్, హెచ్.యూ.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, రాష్ట్ర చిన్న, మధ్యతరగతి పత్రికల సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్, మహబూబ్ నగర్ జిల్లా నాయకులు విజయరాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.


