కాకతీయ, ములుగు : ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ ఆధ్వర్యంలో, సీఆర్‌పీఎఫ్ 39వ బటాలియన్, జిల్లా పోలీసు బలగాల సమన్వయంతో చేపట్టిన “పోరాటం కంటే శాంతి బాగుంది – ముసలితనం తీరే రండి” ప్రత్యేక ప్రచార కార్యక్రమం ఫలితంగా మరోసారి మావోయిస్టులు ఏడుగురు మావోయిస్టులు పోలీసుల సమక్షంలో లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ.. ములుగు జిల్లా పోలీసుల ముందు మొత్తం 7మంది సీనియర్ మావోయిస్టు కేడర్లు లొంగిపోయారు. వారిలో 1 ఏరియా కమిటీ మెంబర్ (ఏ సీఎం), 3 పార్టీ మెంబర్లు,1 ఆర్పిసి అధ్యక్షుడు,1 సిఎన్ఎం సభ్యుడు,1 మిలీషియా సభ్యుడు ఉన్నట్టు తెలిపారు. లొంగిపోయిన పేర్లు థాటి ఉంగి @ రాజే, కొడ్మే సుక్కు, సోడి భీమ @ దీపా, కుంజం వరలక్ష్మి, పద్దం జోగ, కొర్సా పాయికి, సోడి ఆదమ ఉన్నట్టు తెలిపారు.
అరణ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆపరేషన్లు, పలు సార్లు నిర్వహించిన కూంబింగ్ , పోలీసుల “పోరాటం కంటే శాంతి బాగుంది – ముసలితనం తీరే రండి” కార్యక్రమంలో పురోగతితో ప్రభుత్వ పునరావాస పథకాలకు ఆకర్షితులై మావోయిస్టులు లొంగిపోయినట్టు తెలిపారు. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టులు లొంగుబాటు జరిగినట్టు, 11 ఏసీఎంలు, 25 డివిసీఎంలు, 29 ఆర్పీసీలు, 7 సిఎన్ఎమ్ సభ్యులు లొంగిపోయారని ఎస్పీ తెలిపారు.
లొంగుబాటు చేసిన ఈ 7మంది మావోయిస్టులకు ఒక్కొక్కరికి రూ. 25,000 ప్రోత్సాహక తో పాటు, ప్రభుత్వ పునరావాస పథకాల ప్రకారం గరిష్టంగా రూ. 7 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ,వారి కుటుంబాల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు ఎస్పీ తెలిపారు. ప్రాణాల విలువను గుర్తించిన మావోయిస్టులు ఇప్పుడు శాంతియుత జీవనానికి అడుగుపెడుతున్నారని, ప్రభుత్వం, పోలీసులు ఎల్లప్పుడూ వారితో ఉన్నారని, అడవిలో తుపాకీ పట్టుకోవడం కన్నా సమాజంలో శాంతి జీవితం మేలని వారికి అర్థమైందని, మిగతా మావోయిస్టులు కూడా సమాజంలో కలిసిపోవాలి అని ఎస్పీ పిలుపునిచ్చారు.


