- కలెక్టర్ పమేలా సత్పతి
- తిమ్మాపూర్ పీహెచ్‌సీ తనిఖీ
కాకతీయ, కరీంనగర్ : స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి నూతన బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని బస్సును ప్రారంభించారు. రూ.26 లక్షలతో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ బస్సును అందజేసింది. కలెక్టర్ విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ఆమె మాట్లాడుతూ.. మానసిక వికలాంగుల పాఠశాలను స్థాపించి, దశాబ్దాలుగా నిర్విరామ సేవలు అందిస్తున్న ట్రస్ట్ సభ్యులు అభినందనీయులని, వికలాంగుల మానసిక వికాసానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సేవలు ప్రశంసనీయని అన్నారు.
ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 130 మంది విద్యార్థులు చదువుతుండగా, 40 మందికి ఉపాధి లభిస్తోంది. వైద్య శిబిరం ద్వారా 136 మందికి కంటి ఆపరేషన్లు చేయింమని తెలిపారు. కార్యక్రమంలో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ డీజీఎం సీహెచ్. వెంకటరెడ్డి, బోర్డు డైరెక్టర్ తిరుమల, ట్రస్ట్ వ్యవస్థాపకుడు బి.వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే తిమ్మాపూర్ పీహెచ్‌సీని కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. సిబ్బందిని ప్రశ్నించి ఆరోగ్య మహిళా, ఓపీ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. గర్భిణీలకు తప్పనిసరిగా నాలుగు ఏఎన్‌సీ వైద్య పరీక్షలు చేయించాలని, సాధారణ ప్రసవాల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.


