కరీంనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.
15 మందికి గాయాలు కొందరి పరిస్థితి విషమం.
ఒక రోడ్డు ప్రమాదం మరవక ముందే మరొక రోడ్డు ప్రమాదం..!.
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున మరో భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వస్తున్న మెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు (TS21 Z 0116) నిర్లక్ష్యంగా అధిక వేగంతో నడిపిన డ్రైవర్ ఏ. వై. రెడ్డి (హుజురాబాద్) ముందుగా వెళ్తున్న ధాన్యం లోడుతో ఉన్న ట్రాక్టర్ వెనుకభాగాన్ని బలంగా ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15మంది ప్రయాణికులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.సమాచారం అందుకున్న ఎల్.ఎం.డి కాలనీ పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అధిక వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు..



