వర్ధన్నపేట ఎమ్మెల్యేకు వరుస నిరసనలు
ఎక్కడికెళ్లినా ప్రజల ప్రశ్నల వర్షం
తాజాగా 14వ డివిజన్‌లో అభివృద్ధిపై నిలదీత
హామీలు అమలు కాలేదంటూ ఆగ్రహం
సమాధానాలు చెప్పకుండా దాటవేస్తూ వెళ్లిపోయిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యేపై పెరుగుతున్న ప్రజా అసంతృప్తి
కాకతీయ, హన్మకొండ : వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు వరుసగా ప్రజా నిరసనలు ఎదురవుతున్నాయి. వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్‌లో శుక్రవారం ఆయన చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. డివిజన్ అభివృద్ధి అంశంపై స్థానికులు ఎమ్మెల్యేను చుట్టుముట్టి నిలదీశారు. ఏళ్లుగా తమ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు అధ్వాన్నంగా మారాయని, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, వర్షం పడితే కాలనీలు నీటమునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య కూడా పరిష్కారం కాలేదని తెలిపారు.
ఎన్నికల హామీలు ఏమయ్యాయి..?!
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఏమైందని ప్రశ్నించగా ఎమ్మెల్యే వద్ద స్పష్టమైన సమాధానాలు లేవని స్థానికులు ఆరోపించారు. డివిజన్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అడిగినా, నిధులు, పనుల పురోగతి గురించి చెప్పలేకపోయారని విమర్శించారు. ప్రజల ప్రశ్నలు తీవ్రంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో ఎమ్మెల్యే పర్యటనను మధ్యలోనే ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. దీనితో ప్రజల్లో మరింత అసంతృప్తి వ్యక్తమైంది. ఇటీవల వర్ధన్నపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేకు ఇలాంటి నిరసనలు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సమస్యలు పరిష్కరించకుండా పర్యటనలు చేస్తే ప్రజలు సహించబోరని హెచ్చరిస్తున్నారు. డివిజన్‌లో వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించకపోతే, ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని స్థానికులు స్పష్టం చేశారు.


