కాకతీయ, క్రైమ్ బ్యూరో: కూకట్ పల్లి సంగీత్ నగర్ లో 10ఏళ్ల బాలిక సహస్ర దారుణ హత్య వెనక మిస్టరీ వీడింది. పదో తరగతి విద్యార్థి బాలికను హత్యచేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈనెల 18న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చోరీకోసం వెళ్లి బాలిక ఉండటంతో హత్య చేసినట్లు గుర్తించారు. చోరీ ఎలా చేయాలో ముందే పేపర్ రాసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడు రాసుకున్న పేపర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెబుతామని కూకట్ పల్లి పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన క్రిష్ణ, రేణుక దంపతులు ఐదు సంవత్సరాలుగా కూకట్ పల్లి సంగీత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. క్రిష్ణ స్థానికంగా మెకానిక్ షెడ్డులో పనిచేస్తున్నాడు. రేణుకా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తోంది. వీరికి కుమార్తె సహస్ర, కుమారుడు ఉన్నారు. సహస్ర బోయిన్ పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో 6వ తరగతి చదువుతోంది. కుమారుడు ఇంటికి సమీపంలోని పాఠశాలకు వెళ్తున్నారు. సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లారు. వారి కుమారుడు స్కూల్ కు వెళ్లాడు. క్రీడోత్సవాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో బాలిక ఇంట్లో ఉంది.
తాను స్కూల్ కు వెళ్ళి తమ్ముడికి లంచ్ బాక్సు ఇస్తానని బాలిక చెప్పడంతో తల్లి భోజనం సిద్ధం చేసి పెట్టారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో లంచ్ బాక్స్ తీసుకురాలేదంటూ స్కూల్ సిబ్బంది క్రిష్ణకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో తెరిచాడు. కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా కనిపించడంతో భయంతో కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక శరీరంలో 20 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. మెడపైనే 10 ఉన్నాయి. పోస్టు మార్టం ప్రాథమికనివేదిక ప్రకారం హత్య సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించేవారు పోలీసులు తెలిపారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సభ్యులు ఆధారాలను సేకరించారు. జాగిలం ఘటనాస్థలం నుంచి నేరుగా కిందికి వెళ్లింది. దర్యాప్తులో భాగంగా సమీపంలో సీసీ కెమెరాలను సేకరించి ఐదు రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.


